రేవంత్‌, కేటీఆర్‌ది ‘తోడు దొంగల’ ఒప్పందం : ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కామెంట్

రేవంత్‌, కేటీఆర్‌ది ‘తోడు దొంగల’ ఒప్పందం : ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కామెంట్

న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఢిల్లీ పర్యటనలు కేవలం కలిసి పనిచేసుకునేందుకేనని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. ఇద్దరి మధ్య అవగాహన ఉందని, వాళ్ల ఆలోచనలు ఒకటేనని విమర్శించారు. ఈ–-కార్‌, కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులు నెమ్మదిగా సాగుతున్నాయని, దీనికి కారణం ఏంటో రేవంత్‌ చెప్పాలని అర్వింద్‌ ప్రశ్నించారు.

మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీ మీడియాతో మాట్లాడారు. ప్రజలపై భారం వేయడం, కుటుంబ ఆస్తులు పెంచుకోవడం, కమిషన్లు వచ్చే పథకాలు అమలు చేయడమే ఇద్దరి లక్ష్యమని అన్నారు. జెన్‌ జీ విషయంలో రేవంత్‌, కేటీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్‌, యశస్విని రెడ్డిలు జెన్‌ జీ తరానికి చెందినవారేనని, వారికి ముందుగా పదవుల్లో అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు ఆధ్వర్యంలో లక్ష మంది విద్యార్థులతో ఆందోళన చేపట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.